Monday, May 07, 2007

ఏదో చెప్పాలని ఎంతో కాలం క్రిందట మొదలు పెట్టిన ఈ బ్లాగుకి కాలదోషం పట్టడానికి కారణం: ఇంతవరకూ నాకు సరైన యూనీకోడ్ ఎడిటర్ దొరకక పోవడం -- అని ఎవరైనా అనుకుంటే పొరపాటే! ఎందుకంటే నెట్లో ఎవర్నడిగినా చెబుతారు - వీవెన్ గారి లేఖిని ఉండగా వెరే ఎడిటర్లెందుకని. కానీ అందులో కొంచం ఇబ్బంది ఉంది. కాస్త బద్ధకమూ ఉంది. ఇబ్బంది కంటే బద్దకమే ఎక్కువ. అసలు నాకు హర్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం. అందుకని కష్టించి పనిచేసేవాళ్ళని తదెక ధ్యానంతో చూస్తూ ఉంటాను. గాంధీ గారన్నట్టు పని ఎవర్నీ చంపదు. కానీ why taking risk? అనె మతం నాది. నాదేకాదు మనలో చాలా మందిది. కాదంటారా?

ఇలా మొదలు పెట్టిన తర్వాత అడ్డూ ఆపూ లేకుండా చెప్పుకుపోవడం - కవిసామ్రాట్ స్వర్గీయ విశ్వనాధ సత్యనారాయణగారి "దమయంతీ స్వయంవరం" లో చూసి నేర్చుకున్నాను. అప్పటినుంచీ మిత్రులు నన్నుచూసెసరికి దూరం నుంచే పారిపోవడం మొదలు పెట్టారు. దాంతో ఏంచెయ్యాలొతెలియక సతమతమవుతోంటే - అత్మబంధువులా కనిపించింది - ఈ నెట్టూ, అందులో బ్లాగులూను!

సరే ఇక బండి బయలు దేరింది కదా! ఏదోటి ఇలా చెప్పుకుంటూ పోవచ్చు... హమ్మయ్య!
జంఘాల శాస్త్రి మాటవినబడే సరికి మిత్రులు కొంతమందికి అపాతమధురమైన తెలుగు తీయదనం గుర్తు కొచ్చింది. పానుగంటివారి సాక్షి వ్యాసాల సంపుటి నామిత్రుడు రాజమొహన్ నాపెళ్ళికి (౧౯౯౧) బహూకరించాడు. ఇలా శుభకార్యాలకి ఇలా తెలుగు సహిత్యాన్ని బహూకరించే అలవాటు చేసుకొంటే సరైనభాష ప్రజాబాహుళ్యంలొకి త్వరగా చొచ్చుకు పోతుంది. అవునంటారా?

Tuesday, September 26, 2006

ఏదొ చెప్పాలని!

తనకి తెలిసినదాన్ని... అదీ అందరికీ ఉపయోగపడేదాన్ని... నలుగురికీ చెప్పడంలో చాలా ఆనందం ఉంది. అందుకే ఏదోటి చెబుదామని ఈ బ్లాగు మొదలు పెట్టాను. నాకు తెలుగు సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం... అందుకనే చెసే ఉద్యోగంతో సంబంధం లేకపోయినా తేలుగులో ఎం.ఏ చేశాను. చేసి ఏం చేశాను? అందినవన్నీ చదివేశాను... ఆ తర్వాత ఇలా అందరికీ చెప్పి చెప్పి తల బొప్పి కట్టించడం మొదలు పెట్టాను. వినేవాడికి చెప్పేవాడు లోకువ. అలాగని జంఘాల శాస్త్రి ప్పడం మానుకున్నాడా?